Subhodayam Media, 26 నవంబర్ 2026: 
ఏపీలో జరిగిన తొలి దశ మలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై వైసీపీ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అఖిలప్రియ ప్రయాణించిన వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు బలగాలను రప్పించారు. జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు అహోబిలం చేరుకున్నారు.
మరోవైపు ఆళ్లగడ్డ మండలం జమ్మదిన్నెలోనూ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద కారంపొడి చల్లుకుని ఇరువర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ పోలింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
అలాగే, పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. 10వ వార్డు పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సు పగులగొట్టేందుకు కొందరు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బూత్ క్యాప్చరింగ్కు పాల్పడ్డారని ఇరువర్గాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.
బొల్లాపల్లి మండలం వెల్లటూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన వైకాపా శ్రేణులు బ్యాలెట్ బాక్సు పగులగొట్టి పత్రాలను చించివేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకి చేరుకుని ఆందోళన చేస్తున్న ఇరువర్గాలను చెదరగొట్టారు.