Subhodayam Media, 25 నవంబర్ 2026: 
Srisailam Karthika Pournami నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు జ్వాలాతోరణోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో శ్రీశైలం క్షేత్రం మార్మోగింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. ప్రత్యేక స్తంభాలపై నూలుతో తయారు చేసిన వత్తులను ఉంచి నెయ్యితో తడిపారు. అనంతరం శ్రీభ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఆలయం లోపలి నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా గంగాధర మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దివిటీలతో జ్వాలాతోరణాలను వెలిగించారు.

Srisailam Karthika Pournami జ్వాలాతోరణం వెలిగిన సమయంలో భక్తులు ‘ఓం నమః శివాయ’, ‘హరహర మహాదేవ శంభో శంకరా’ అంటూ చేసిన నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. జ్వాలాతోరణం కింద నుంచి భక్తులు దాటుతూ తమ భక్తిని చాటుకున్నారు. తోరణం నుంచి వచ్చిన వత్తుల భస్మాన్ని పవిత్రంగా భావించి తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశవిధ హారతుల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.