Subhodayam Media, 23 నవంబర్ 2026: రిలయన్స్ జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ 2.0 పేరుతో కొత్త ప్లాన్లను ప్రకటించింది. రూ.399, రూ.3,999 ధరలతో రెండు ప్రధాన ప్లాన్లను జియో కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా అన్లిమిటెడ్ 4జీ, 5జీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.3,999 ప్లాన్ ద్వారా ఏడాది పొడవునా అంటే 365 రోజుల పాటు సేవలు పొందవచ్చు. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపే వెసులుబాటు ఉంది.
రూ.399 ప్లాన్ తీసుకున్న వారికి రూ.4 వేల విలువైన 12 నెలల కాన్వా ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా ప్రీమియం డిజైన్ టెంప్లేట్లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో హాట్‌స్టార్ మొబైల్, జియో టీవీ ద్వారా ఫ్యాన్‌కోడ్, జియో గేమ్స్ సబ్స్క్రిప్షన్లు అందుతాయి. జియో ఏఐ క్లౌడ్‌లో 50జీబీ డేటా స్టోరేజ్ లభిస్తుంది. చిరు వ్యాపారుల కోసం జస్ట్ డయల్ లైట్, డిజిటల్ డైరీ, కూపన్లను కంపెనీ ఈ ప్లాన్ లో చేర్చింది.
వార్షిక ప్లాన్ రూ.3,999 కింద రూ.1,590 విలువైన కాన్వా ప్రో లైట్ సబ్స్క్రిప్షన్ 12 నెలల పాటు లభిస్తుంది. ఇందులో కూడా జియో హాట్‌స్టార్ మొబైల్, ఫ్యాన్‌కోడ్, 50జీబీ క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం ఉంటుంది. అయితే జియో గేమ్స్ సబ్స్క్రిప్షన్, బిజినెస్ టూల్స్ ఈ ప్లాన్ లో అందుబాటులో లేవని కంపెనీ స్పష్టం చేసింది.
ఇవి మాత్రమే కాదు.. జియో కొత్తగా అన్లిమిటెడ్ 5జీ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను తెచ్చింది. రూ.15 ప్యాక్ ద్వారా ఒక రోజు, రూ.25 ప్యాక్ ద్వారా రెండు రోజుల పాటు అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందవచ్చు. వీటికి ఎటువంటి స్పీడ్ లిమిట్ ఉండదు. రాత్రి పూట డేటా వాడే వారి కోసం రూ.50 ప్యాక్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్లిమిటెడ్ 4జీ, 5జీ డేటా వాడుకోవచ్చు.
ఈ సమయంలో వాడే డేటా బేస్ ప్లాన్ బ్యాలెన్స్ నుంచి కట్ అవ్వదు. రూ.399, రూ.3,999 ప్లాన్లు, రూ.25 యాడ్-ఆన్ ప్యాక్ నవంబర్ 24 నుంచి అందుబాటులోకి వస్తాయి. రూ.15 యాడ్-ఆన్ ప్యాక్ ఇప్పటికే అందుబాటులో ఉంది. రూ.50 నైట్ డేటా ప్యాక్ నవంబర్ 26 నుంచి లభిస్తుంది. మై జియో యాప్, జియో వెబ్ సైట్, జియో స్టోర్లు, రిటైల్ అవుట్ లెట్లలో రీఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.