
Subhodayam Media, 26 నవంబర్ 2026: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) జీవితం, అతను చేసిన వందల కోట్ల రూపాయల ఆర్థిక మోసాల ఆధారంగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ (Netflix) ఒక కొత్త ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీని ప్రకటించింది. ‘లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ’ (Love, Scam Aur Dhokha: The Sukesh Chandrashekhar Story) పేరుతో రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 18, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ డాక్యుమెంటరీకి మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వం వహించారు. బెంగళూరులో సాధారణ స్థాయి నుంచి మొదలైన సుకేశ్ ప్రస్థానం, దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను సైతం బురిడీ కొట్టించే స్థాయికి ఎలా చేరిందో ఇందులో చూపించనున్నారు. ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలబ్రిటీలతో అతనికి ఉన్న సంబంధాలు, విలాసవంతమైన బహుమతుల వెనుక ఉన్న అసలు కథను ఈ సిరీస్ ఆవిష్కరించనుంది.
రెండేళ్లకు పైగా సాగిన లోతైన పరిశోధన ఆధారంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. కేవలం వార్తల్లో కనిపించిన అంశాలకే పరిమితం కాకుండా, తీహార్ జైలులో ఉంటూనే సుకేశ్ తన మోసాల నెట్వర్క్ను ఎలా నడిపించాడో, వ్యవస్థలోని ఏ లోపాలు అతనికి అనుకూలంగా మారాయో ఇందులో విశ్లేషించనున్నారు. నకిలీ గుర్తింపులతో ఎదుటివారిని నమ్మించి వందల కోట్లు కొల్లగొట్టిన తీరును ఈ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపనుంది. గతంలో నెట్ఫ్లిక్స్లో సంచలనం సృష్టించిన ‘కర్రీ అండ్ సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్’, ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్’ వంటి డాక్యుమెంటరీలను రూపొందించిన బృందమే దీనిని కూడా తెరకెక్కించింది.