
Subhodayam Media, 29 నవంబర్ 2026: BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం వినూత్న ఆఫర్‌ను అందిస్తోంది. కేవలం రీఛార్జ్ ప్లాన్లతోనే ఉచితంగా ప్రమాద బీమా, సైబర్ మోసం బీమా సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందుకోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఆఫర్‌లో భాగంగా అర్హత కలిగిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లపై రూ.1 లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.10 వేల వరకు సైబర్ ఫ్రాడ్ కవర్ లభించనున్నాయి.
BSNL రూ.202 ప్లాన్ 32 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో వినియోగదారులకు మొత్తం 300 నిమిషాల వాయిస్ కాలింగ్, 5GB హైస్పీడ్ డేటా లభిస్తాయి. డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40Kbpsకు తగ్గుతుంది. అలాగే మొత్తం 100 SMSలు అందుబాటులో ఉంటాయి. పరిమిత కాలింగ్, డేటా అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే BSNL రూ.2,449 వార్షిక ప్లాన్‌పై ప్రస్తుతం అదనంగా 15 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్.. ఆఫర్ కారణంగా మొత్తం 380 రోజుల వ్యాలిడిటీని పొందుతోంది. ఈ అదనపు వ్యాలిడిటీ ఆఫర్ నవంబర్ 30తో ముగియనుంది. ఆ తర్వాత మళ్లీ 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు అందిస్తారు. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40Kbpsకు తగ్గుతుంది.

ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకునే వినియోగదారులకు ఉచితంగా బీమా సౌకర్యాలను కల్పిస్తోంది. రీఛార్జ్ చేసిన 24 గంటల్లో బీమా ఆటోమేటిక్‌గా ఇది యాక్టివేట్ అవుతుంది. సంబంధిత ప్లాన్ వ్యాలిడిటీ ముగిసే వరకు ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమా ద్వారా రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, పాముకాటు, పిడుగుపాటు, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల కారణంగా మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.1 లక్ష వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన 48 గంటల్లోపు బీమా కంపెనీకి సమాచారం అందించాల్సి ఉంటుంది.
అంతేకాదండోయ్.. పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను దృష్టిలో పెట్టుకుని రూ.10 వేల వరకు సైబర్ ఫ్రాడ్ బీమాను కూడా అందించడం ఈ ప్లన్స్ స్పెషల్. ఫిషింగ్, ఈమెయిల్ స్పూఫింగ్ లేదా ఇతర ఆన్‌లైన్ మోసాల కారణంగా డబ్బు కోల్పోతే నిబంధనల ప్రకారం రూ.10 వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే వినియోగదారుడి BSNL మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. అలాగే సైబర్ మోసం జరిగిన ఏడు రోజుల్లోపు సంబంధిత సంస్థకు సమాచారం అందించాలి. ప్రమాదం జరిగినప్పుడు లేదా సైబర్ మోసానికి గురైనప్పుడు క్లెయిమ్ నమోదు చేయడానికి వినియోగదారులు 1800-11-8485 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. లేదా Claims.bsnl@orientalinsurance.co.in ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు, కార్మికులు, సాధారణ ప్రజలకు కూడా బీమా రక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కంపెనీ వెల్లడించింది. ప్రత్యేకంగా బీమా పాలసీలు తీసుకోలేని వారికి ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
