Subhodayam Media, 24 నవంబర్ 2026: 
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు విధించిన ఒక యేడాది జైలుశిక్ష వివాదం సుఖాంతమైనట్టుగా తెలుస్తోంది. ఈ కేసు వివాదం సామరస్యంగా పరిష్కారమైనట్టు పిటిషనర్ జెట్టి వెంకటేశ్వర రావు మంగళవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గతంలో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పు తీసుకున్నారు. జానకిరామయ్య మరణం తర్వాత ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర రావుకు బండ్ల గణేశ్ తన పరమేశ్వర ఆర్ట్స్ పేరిట చెక్ ఇచ్చారు. అయితే ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో వెంకటేశ్వర రావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఒంగోలు కోర్టు బండ్ల గణేశ్‌ను దోషిగా తేల్చి ఒక యేడాది పాటు సాధారణ జైలుశిక్షతో పాటు రూ.95 లక్షల అపరాధం కూడా విధిస్తూ, పిటిషనర్‌కు కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పు అనతంరం జెట్టి వెంకటేశ్వర రావు తాజాగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమ మధ్య ఉన్న చిన్నపాటి వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కావాలనే అపరాథ్లు సృష్టించి లేనిపోని తప్పుడు ప్రచారం చేశారు అని పేర్కొన్నారు.
గతంలో తమ కుమారుడు, బండ్ల గణేశ్ ఎంతో స్నేహంగా ఉండేవారని, తన కుమారుడు మరణం తర్వాత ఇగో కారణంగానో లేక మధ్యవర్తుల ప్రమేయం వల్లనో చిన్నపాటి మనస్పర్థలు వచ్చి కోర్టు కేసుల వరకు దారితీశాయని వివరించారు.
ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య విభేదాలు తొలగిపోయాయని, బండ్ల గణేశ్‌తో తన స్నేహం, అనుబంధం గతంలోలాగే కొనసాగుతాయని వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ చెక్ కౌన్స్ కేసు వివాదానికి తెరపడినట్టయింది.